UPDATED 8th NOVEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: మండల పరిధిలోని ఉండూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోటివేషన్ క్లాసులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కస్టమ్స్ జాయింట్ కమిషనర్ సిఎస్ నరసింహారెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్టమ్స్ జాయింట్ కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని చదువును కష్టంతో కాక ఇష్టంతో చదవాలని, విద్యార్థులు ఇప్పటి నుంచే పోటీ తత్వాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు అవసరమైన రూ మూడువేల విలువైన పుస్తకాలు, డిసెంబరు నుంచి తిరుపతిలో జరిగే జాతీయస్థాయి రన్నింగ్ పోటీలకు ఉండూరు పాఠశాల నుంచి ఎంపికైన స్టీఫెన్ అనే విద్యార్థికి రూ. రెండు వేలు నగదు ప్రోత్సాహం అందచేశారు. జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి తరువాత చదువును మానేయకుండా ఉన్నత చదువులు చదవాలని, అలాగే స్వశక్తితో తమ కాళ్ల మీద తాము నిలబడి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. వెంకటరెడ్డి, సామర్లకోట ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







