* ఆర్డీవో ఎస్. మల్లిబాబు
UPDATED 29th OCTOBER 2020 THURSDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజాస్వామ్యానికి ఓటే వజ్రాయుధమని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2020, ఓటర్లను చైతన్య పరచి భాగస్వామ్యం చేసేందుకుగాను స్థానిక సుధా ఆగ్రో ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రతీ పౌరుడు ఓటు హక్కును కలిగి ఉండాలని అన్నారు. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రభుత్వమే పరిపాలిస్తుందని, ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమీషన్ దే ప్రధాన పాత్ర అని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును కలిగి ఉండాలనే దృక్పథంతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటు హక్కు నమోదు, మార్పులు, ఓటు బదిలీలు, తదితర అంశాలపై అవగాహన లేక అనేకమంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని అన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6, శాసనసభ నియోజకవర్గం నుంచి వేరే శాసనసభ నియోజకవర్గానికి మార్చుకునేందుకు ఫారం-7, ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఫారం-8, ఓటర్ల జాబితా ఎంట్రీలలో మార్పులు ఫారం-8ఏ, తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని యూనిట్ సిబ్బందికి, కార్మికులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సుధా ఆగ్రో ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ జూనియర్ ఎండి ఇవి. సుధాకర్, ఫ్యాక్టరీ సిబ్బంది, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.







