వరలక్ష్మీ నమోస్తుతే..

* కనులపండువగా వరలక్ష్మీవ్రతం
* భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు

UPDATED 9th AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన స్థానిక శ్రీచాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆలయ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చారు. పుణ్యాహవచనం, కలశస్థాపన చేసి అమ్మవారి ఆవాహం, ఆరాధన, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ అర్చకులు వేమూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, సన్నిధిరాజు వెంకన్న, చెరుకూరి రాంబాబు భక్తులకు వివరించారు. వ్రతం అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి మాట్లాడుతూ శ్రావణమాసం మూడవ వారం వ్రతం చేయించుకునే భక్తులు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే పట్టణ పరిధిలోని నాల్గవ వార్డులో గల కనకదుర్గ ఆలయంలో జరిగిన వరలక్ష్మీ పూజల్లో రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు దవూలూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న మహిళలకు మాజీ కౌన్సిలర్ ఊబా జాన్ మోజేష్ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, మాజీ కౌన్సిలర్లు పిల్లాడి సత్యవతి, పవన్, జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us