UPDATED 24th JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ పాఠశాలలో సామర్లకోట, పెద్దాపురం పట్టణ పరిధిలో గల మునిసిపల్ ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు గురువారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాపులో పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిఎంఏ సరఫరా చేసిన స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని అత్యధిక 10/10 జిపిఏ సాధించి సామర్లకోట పట్టణంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ లైన్స్ క్లబ్ సహాయంతో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, ఆర్. శ్రీనివాసరాజు, టి. శ్యాంసుందర్, హేమలత, రామకృష్ణమూర్తి, కోఆర్డినేటర్లు కె.ఎస్. కరీం, వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.







