UPDATED 4th APRIL 2019 THURSDAY 6:30 PM
పెద్దాపురం/సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో తిరుగుతూ జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొరను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో గల పెద్దాపురం, సామర్లకోట పట్టణాలతో పాటు మండల పరిధిలో గల పలు గ్రామాల్లో జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ గుర్తు గాజులు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. జై భారత్ నాయకుల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ గ్రామాలకు వచ్చిన నాయకులకు స్థానిక మహిళలు బొట్టుపెట్టి మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. స్థానికులు, యువకులు డప్పుచప్పుళ్లు, నృత్యాలతో ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండడంతో నాయకులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విశ్వాశాన్ని కోల్పోయాయని, పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. అధికార దాహం కోసం ప్రాకులాడే నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు. తమ పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జివివి సత్యనారాయణ, కె. అబ్బాస్, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







