డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారి

UPDATED 18th APRIL 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించే విధంగా రైతులకు డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేసే విధానం గురించి స్థానిక నవభారత్ షుగర్ వెంచర్స్ యాజమాన్యం అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కూలీలు కొరతగా ఉన్న తరుణంలో పురుగు మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లు చాలా ఉపయోగపడతాయని అన్నారు. రైతులు గ్రూప్ సభ్యులుగా ఏర్పడి వీటిని కొనుగోలు చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. డ్రోన్ల సహాయంతో రోజుకు 20 నుంచి 70 ఎకరాల వరకు పురుగు మందును పిచికారి చేయవచ్చని తెలిపారు. ఈ డ్రోన్లను కె.ఎల్. యూనివర్సిటీ విద్యార్థి ఎ. గోపీరాజా తయారుచేశారు. ఈ సందర్భంగా గోపీరాజా మాట్లాడుతూ ఈ డ్రోన్ ఒక బ్యాటరీ సహాయంతో రోజుకు పావుగంట పనిచేస్తుందని, ఆ తర్వాత మరొక బ్యాటరీని దానికి బిగించుకునే ఏర్పాటు చేశామన్నారు. గంటసేపు ఛార్జింగ్ ఉండే డ్రోన్ కూడా త్వరలో తీసుకువస్తామని చెప్పారు. డ్రోన్ల సామర్థ్యాన్ని బట్టి రేటు ఉంటుందని, రెండు లీటర్లు సామర్థ్యం గల డ్రోన్ రూ. రెండు లక్షలు, ఐదు లీటర్లు సామర్థ్యం గల డ్రోన్ రూ. మూడు లక్షలు వరకు ఉంటుందన్నారు. విదేశాల నుంచి పరికరాలు దిగుమతి చేసుకోవడం వల్ల అంత ఖర్చు అవుతుందని తెలిపారు. ఒక రైతు ఒక డ్రోన్ కొనుగోలు చేసి దానిని అద్దెకు ఇవ్వడం వల్ల ఒక సంవత్సరంలో తాను పంటకు పెట్టిన పెట్టుబడి మొత్తం వస్తుందని చెప్పారు. త్వరలోనే తక్కువ ఖర్చుతో  డ్రోన్లు తయారు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత్ షుగర్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ నాగభైరవ ప్రభాకర్, జనరల్ మేనేజర్ యార్లగడ్డ కోటయ్య, డిజిఎం ఎం.రాఘవయ్య, వెంకటేశ్వరరావు, ఫ్యాక్టరీ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us