UPDATED 29th MARCH 2018 THURSDAY 5:30 PM
పెద్దాపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ తాను పెద్దాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆయన గురువారం పాల్గొని మాట్లాడారు. తనను పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలతో ఆదరించి తనను గెలిపించారని, దీంతో తాను ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిని అయ్యానని పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణాన్ని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీపై ఓర్వలేనితనంతో దూషణలకు దిగుతున్నాయని, ఎంతమంది ఎన్ని కుతంత్రాలు చేసినా టిడిపి అభివృద్ధిని అడ్డుకోలేరని ఆయన హితవు పలికారు.







