UPDATED 5th JUNE 2019 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని ఇండియానా స్టేట్ యూనివర్సిటీ (యుఎస్) లెర్నింగ్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ జార్జియానా డ్వార్ట్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో బుధవారం ఆమె మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పచ్చదనం కోసం మొక్కలను నాటడం, నీటిని పొదుపుగా వాడడం, భూగర్భ జలాలను పెంచేందుకు ఇంటికో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పర్యావరణం ప్రకృతి ప్రసాదించిన వరమని, పెరుగుతున్న కాలుష్యం మూలంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందని అన్నారు. ఓజోన్ పొర దెబ్బతిని ప్రకృతిలో పెను మార్పులు చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్, లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, తదితరులు పాల్గొన్నారు.







