UPDATED 13th DECEMBER 2018 THURSDAY 5:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగుబంగారంలా విరాజిల్లుతున్న పెద్దాపురం పట్టణంలో స్థానిక అమరగిరిపై వేంచేసివున్నశ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర శుద్ధ షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎడవల్లి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారిని ప్రత్యేక వేదికపై ఆశీనులను గావించారు. వివిధ సుగంధ పుష్పమాలికలతో సిద్ధం చేసిన వేదికపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు పండితులు విఘ్నేశ్వర పూజ, పంచామృతాభిషేకాలు, పుణ్యాహవచనము, మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమాలు, తదితర పూజలను నిర్వహించిన అనంతరం స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారికి నూతన వస్త్రాలను బహూకరించారు. పండితులు భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, జక్కంపూడి విజయలక్ష్మి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







