UPDATED 22nd JANUARY 2020 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం మహిళలకు ఆయుధం వంటిదని
మెప్మా టౌన్ మిషన్ మేనేజర్ కె. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక మెప్మా కార్యాలయంలో టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో దిశ చట్టంపై మహిళా ఆరోగ్య భద్రతా కమిటీల సభ్యులకు బుధవారం నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు విద్య అవసరం లేదనే పరిస్థితుల నుంచి నేడు అన్ని రంగాల్లో పోటీ పడుతున్న పరిస్థితికి ఎదిగారని, అయినా మహిళలపై దాడులు, అకృత్యాలు జరుగుతుండడం విచారకరమన్నారు. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జి. అపర్ణ మాట్లాడుతూ 2013లో నిర్భయ చట్టం వచ్చినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని, మరిన్ని అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019లో దిశ చట్టం తీసుకు వచ్చారని తెలిపారు. చట్టం ద్వారా నేరం రుజువు అయితే 21 రోజుల్లో నిందితుడికి మరణశిక్ష పడుతుందని తెలిపారు. దాంతో ఆకతాయిలు మహిళల జోలికి వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల మహిళా కానిస్టేబుళ్లు ఎ. అమరలక్ష్మి, ఎం. ధనలక్ష్మి, ఎం. మాధవి, హేమలత, వై. చిట్టితల్లి, జి. లలిత, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







