UPDATED 9th JANUARY 2018 TUESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారని డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంకిత్ కౌత్ర అను సామాజికవేత్త మూడు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఫీడింగ్ ఇండియా పేరిట ప్రారంభించిన సేవా సంస్థకు ఆకర్షితురాలైన తమ కళాశాల విద్యార్థిని గుణ్ణం ప్రీతి వెంకట సూర్యదుర్గ తన మిత్రులతో కలిసి కాకినాడ పరిసర ప్రాంత ప్రజల నుంచి దుస్తులు, వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి పేదలకు అందించడం జరుగుతుందన్నారు. ఫీడింగ్ ఇండియా సంస్థలో దేశవ్యాప్తంగా ఇంతవరకు 20 వేల మంది వాలంటీర్లుగా చేరారని, అందులో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు కూడా చేరి ఇటువంటి ప్రజాహిత సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవడం గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ప్రీతి మాట్లాడుతూ ఫీడింగ్ ఇండియా సంస్థ తరఫున టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ను అందించి ఆ ఫోటోను ఢిల్లీలో గల తమ సంస్థకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. మంచి సామాజిక స్పృహతో సేవలందిస్తున్న విదార్థి బృందాన్ని అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.







