UPDATED 3rd FEBRUARY SUNDAY 9:00 PM
సామర్లకోట: మహరాష్ట్ర రాజధాని ముంబాయిలో ఈనెల 5వ తేదీన జరగనున్న ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్-2019లో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ కు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ముంబాయిలోని దాదర్ లో మైసూర్ అసోసియేషన్ ఆడిటోరియంలో ఈ ఫెస్టివల్ జరుగుతుందని నృత్యకారుడు ప్రసాద్ ఆదివారం విలేఖరులకు తెలిపారు. ఇప్పటికే కూచిపూడి నృత్యకారుడు ప్రసాద్ దేశ, విదేశాల్లో ప్రఖ్యాత వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తూ అనేక అవార్డులు, రివార్డులు పొందుతున్న విషయం విదితమే. ఈ నేపధ్యంలో ముంబాయిలో నేషనల్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ కు తనకు ఆహ్వానం అందడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), సీనియర్ కళాకారులు, నవలా రచయిత అంబటి అప్పారావు, కంచి మహాసంస్థానం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర, ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), రోటరీ క్లబ్ నాయకులు అంబటి సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, వీరభద్ర జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్రప్రసాద్ (ఆస్ట్రోప్రసాద్) తదితరులు అభినందించారు.







