UPDATED 22nd JANUARY 2020 WEEDNESDAY 7:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆంగ్ల మాధ్యమ శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, గౌరవ అతిధులుగా బొమ్మూరు ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ జయశ్రీ, పిఓ భాస్కరావు, డిసిఈబి వెంకట్రావు, కె.ఆర్.పి. జగపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఈవో అబ్రహం మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ శిక్షణా తరగతులకు జిల్లాలోని 64 మండలాల నుంచి మండలానికి నలుగురు ఉపాధ్యాయులు పాల్గొంటారని, ఇది తెలుగు-ఇంగ్లీషు మీడియం బ్రిడ్జి కోర్సుగా చెప్పవచ్చని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆయా మండలాల్లో గల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన తర్వాత ప్రయివేట్ పాఠశాలల నుంచి 38 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరారని, రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం గొప్ప సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ప్రతీ విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకంతో ప్రతీ తల్లికి ఆర్ధిక స్వావలంబన, నాడు-నేడు పథకంతో పాఠశాలలకు మౌలిక సౌకర్యాల కల్పన, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా ఉన్నత విద్యకు తోడ్పాటు అందించుట, జగనన్న విద్యా దీవెన పథకంతో హాస్టల్ విద్యార్థుకు ఆర్ధిక సాయం, జగనన్న గోరుముద్ద పథకంతో పౌష్టికాహారం అందిస్తూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విద్యాభివృద్ధితోనే భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి అందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను నెరవేర్చే గురుతర బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వక్తలు వివరించారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 256 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.







