UPDATED 13th AUGUST 2017 SUNDAY 9:00 PM
రాజమహేంద్రవరం : గోదావరి అంటే తనకెంతో ఇష్టమని, అందుకే తాను దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రంలోనూ ఒక సన్నివేశమైనా ఈ ప్రాంతంలో చిత్రీకరిస్తానని కళాతపస్వి, ప్రముఖ సినీదర్శకులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఆదివారం సాయంత్రం నగరానికి చెందిన నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా, దొండపాటి సత్యంబాబు ఆధ్వర్యంలో నవరస నట సమాఖ్య ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సభను వ్యాపారవేత్త డి.బి.వెంకటపతిరాజు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ విశ్వనాధ్ కు స్వర్ణ కంకణం, పట్టువస్త్రాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంతో ఇక్కడి గోదావరితో తనకు చాలా అనుబంధముందని, పాపికొండలు, పట్టిసీమ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ఆ దిశగా చిత్రాలు తీసిన దర్శకుడని, ఆయన చిత్రంలో కనీసం ఒక చిన్న పాత్ర అయినా కావాలని కోరుకుంటారని, సూత్రధారులు చిత్రంలో నటించటం తన అదృష్టమని అన్నారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ గోదావరి తీరంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఆణిముత్యాలుగా నిలిచి పోతాయన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో విశ్వనాథ్ చిత్రాలు అపురూపమని, తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు చిన్నారి శైలికాపాత్రో గణేశకౌతం, శంకరాభరణంలోని దొరకునా ఇటువంటి సేవ గీతానికి నృత్యాభినయం చేసి అలరించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు జి.వి.హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు







