మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలి

UPDATED 21st FEBRUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మార్చి నెల 2 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. కాకినాడ ఆర్డీవో రాజకుమారి అధ్యక్షతన మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గురువారం ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మహాశివరాత్రి మార్చి నెల 4వ తేదీ సోమవారం రావడంతో సుమారు లక్షమందికి పైగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ పారిశుధ్యం, లైటింగ్, టాయిలెట్స్ ఏర్పాట్లను పకడ్బందిగా చేయాలని, అలాగే ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు భక్తులకు త్రాగునీరు సక్రమంగా అందేలా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా సిమెంట్  రోడ్డుకు రూ. 55 లక్షలు మంజూరు చేశారని, త్వరలో రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గోదావరి కాలువ స్నాన ఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక శాఖ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో భక్తులకు అన్నదానం అందించే ఏర్పాట్ల వద్ద తోపులాటలు లేకుండా చూడాలని, పొల్యూషన్ శాఖ పది రోజుల ముందే గోదావరి కాలువ నీరు స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, గోదావరి జలాలు కలుషితం చేసే పరిశ్రమలపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 24 గంటలు విద్యుత్ సప్లై ఉండేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీ వలన అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య శాఖ ముఖ్య కూడళ్లలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆలయం బయట ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, లోపల మాత్రం పురావస్తు శాఖ అనుమతి లేనందున పనులు జరగలేదని, త్వరలో వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు డార్మెంటరీ పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. ఆర్డీవో రాజకుమారి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని, వీటికి సంబంధించిన కార్యాచరణపై నివేదికను తయారుచేసి తదుపరి సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వారు చేపడుతున్న చర్యలపై మంత్రికి వివరించారు. అనంతరం నియోజక వర్గంలోని తొమ్మిది మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,32,350/- విలువగల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మునిసిపల్ వైస్ చెర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు, డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, మున్సిపల్ కమీషనర్ నాగేంద్రకుమార్, తహసీల్దార్  నరసింహారావు, సిఐ యువకుమార్, విద్యుత్ శాఖ ఎడి ఎ. రామకృష్ణ, వేమూరి సోమేశ్వర శర్మ, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us