* పోటీ ప్రపంచంలో విజ్ఞానం ముఖ్యం
* గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ
UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 7:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల ప్రాంగణంలో సాంకేతిక ఉత్సవం "మేధ" శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మేధ కన్వీనర్ డాక్టర్ బి. సుజాత అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభకు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలుత ప్రఖ్యాత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం "మేధ" ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశి కిరణ్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ ఇంజినీర్లకు వారు సాధించే మార్కుల కంటే విజ్ఞానం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రముఖ సంస్థలు ప్రాంగణ ఎంపికల సమయంలో విజ్ఞానవంతులకే ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గైట్ కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, వారిలో కొందరిని మేధ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధులుగా ఆహ్వానించామని అన్నారు. గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీశశివర్మ మాట్లాడుతూ "మేధ" సాంకేతిక ఉత్సవాలు రెండురోజులపాటు జరుగుతాయని, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ దినోత్సవం జరుగుతుందని అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవ సందర్భంగా గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విధంగా ఈ ఏడాది కూడా గైట్ ప్రాంగణంలో మేధను భారీస్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గైట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.ఎస్. గుప్తా మాట్లాడుతూ భావి ఇంజినీర్లలోఅంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసి ప్రదర్శించేందుకు మేధ వంటి సాంకేతిక ఉత్సవాలు ఒక వేదికగా ఉపయోగపడతాయని అన్నారు. పరస్పర విజ్ఞానమార్పిడికి, అంచనాలను పంచుకునేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన మూడు వేలమందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని, వివిధ రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారని, 36 ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు మేధ కన్వీనర్ డాక్టర్ సుజాత తెలిపారు. యువ ఇంజినీర్లు ప్రదర్శించిన ప్రాజెక్టులను గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ, తదితరులు సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ సమావేశంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి, డీన్స్, డైరెక్టర్స్, వివిధ విభాగాల అధిపతులు,కో-కన్వీనర్ వి. బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు







