క్రమశిక్షణతో కూడిన జీవితం ఆధ్యాత్మిక చింతనతోనే సాధ్యం

UPDATED 4th MAY 2018 FRIDAY 9:00 PM

ప్రత్తిపాడు: భక్తిని పెంపొందించుకోవడం ద్వారా ప్రతి మనిషి జీవితం క్రమశిక్షణతో కూడి ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం-గజ్జనపూడి గ్రామంలో గల మణిదీపం కొండపై శ్రీచక్రసమేత మహా రాజేశ్వరీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య, మహాలక్ష్మి, సరస్వతి, ఆంజనేయస్వామి శిలా విగ్రహాల ప్రతిష్ట, శిఖర కలశస్థాపన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ వరలక్ష్మీ నరసింహరాజు స్వామీజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా స్వామిజీ వేదపండితులు, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి, శాసనసభ్యుడు రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, సర్వదేవతా మహాశాంతి హోమంలో పాల్గొని హోమ క్రతువును నిర్వహించారు. అనంతరం వారు వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి భక్తిని పెంపొందించుకుంటే క్రమశిక్షణతో కూడిన జీవితం పొందవచ్చని, శ్రీశ్రీశ్రీ వరలక్ష్మీ నరసింహరాజు స్వామిజీ మంచి వాతావరణంలో మణిదీప కొండపై ఈ ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. మనిషిని సన్మార్గంలో నడిపించడానికి భక్తి సరైన మార్గమని, ధైవం మనస్సులో ఉంటే ఏ మనిషికి చెడుభావనలు కలగవని అన్నారు. పాపాలు పెరగకుండా దేవాలయాలు కాపాడతాయని అన్నారు. ప్రజలందరికీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయాలను మంచి వాతావరణంలో నెలకొల్పి అమ్మవారి సేవ చేస్తూ ప్రజలకు భక్తిభావనలు పెంపొందిస్తున్న స్వామిజీని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేవాలయ నిర్మాణకర్త స్వామిజీ మాట్లాడుతూ భక్తుల కష్టాలను తీర్చి వారి జీవితాలు సుఖ సంతోషాలతో మెలగాలనే సత్ సంకల్పంతో సుమారు రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్లు వ్యయంతో ఆలయాన్ని నిర్మించానని తెలిపారు. అనంతరం భక్తులు తీర్థ, అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ప్రత్తిపాడు ఎఎంసి  చైర్మన్ కన్నబాబు, అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యుడు పర్వత రాజబాబు, పెద్దాపురం ఆర్డీవో  వి. విశ్వేశ్వరరావు, ప్రత్తిపాడు తహసీల్దార్  నాగమల్లేశ్వరరావు, విగ్రహ ప్రతిష్ట సిద్దాంతి శ్రీసుదర్శం మురళీ కృష్ణాచార్యులు, పర్వత సురేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us