UPDATED 21st JUNE 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: యోగాభ్యాసాన్ని నిరంతరంగా సాధన చేయాలని ఇది ఆరోగ్యానికి అపర సంజీవనిలా పని చేస్తుందని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగాసాధన కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ వేల సంవత్సరాల సంపద అయిన యోగాను భవిష్యత్ తరాలకు అందాలంటే అది విద్యార్థులతోనే సాధ్యమవుతుందని అన్నారు. యోగా సాధనతో ఆరోగ్యం పెంపొందుతుందని వాటి సాధనలో ప్రపంచఖ్యాతిని గడించామని, ప్రతీ ఒక్కరూ యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఎంపిడివో కె. స్వప్న మాట్లాడుతూ మానవాళి జీవనస్రవంతిలో శరీరానికి వ్యాయామం అవసరమని యోగాసనాలు చేయడం వల్ల శరీరంలోని ఆయా అవయవాలు బాగా పనిచేసి జీవన ప్రమాణాలు పెంపొందించుకోవచ్చని సూచించారు. యోగా సాధన వల్ల ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రీయంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతీ ఒక్కరూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకర వాతావరణంలో క్రమం తప్పకుండా యోగాసాధన చేయాలని సూచించారు. మానవాళి జీవన గమనాన్ని శారీరక, మానసిక ఇబ్బందులు లేకుండా గడపవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ సి.హెచ్. జగ్గారావు, ఎంఈవో వై. శివరామకృష్ణయ్య, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ, వ్యాయమ ఉపాధ్యాయులు టి. వైకుంఠం, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం యు. సత్యన్నారాయణ, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







