UPDATED 4th AUGUST 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామరక్షని కౌన్సిలర్ నేతల వెంకటలక్ష్మి అన్నారు. స్థానిక 15వ వార్డు అయోధ్యరామపురంలో గల అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా శనివారం పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ పోషక విలువలతో కూడిన ముర్రుపాలు బిడ్డల రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయని, బ్యాక్టీరియా, వైరస్, క్రిములు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఒక సంజీవనిలా పనిచేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలని, ఇవి ఎంతో శ్రేష్ఠమైనవని, శిశువుల్లో తలెత్తే అనేక రుగ్మతల నిర్మూలనకు అడ్డుగోడగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం గర్భిణీలకు బాలసంజీవని పోషకాహార సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







