UPDATED 29th JANUARY 2018 MONDAY 6:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఫిబ్రవరి నాలుగున ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ పెదబ్రహ్మదేవం గ్రామస్తులే కాకుండా ఇల్లపల్లి, రంగాపురం, మేడపాడు, మర్రిపూడి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఈ శిబిరాన్ని వినియోగించుకోవచ్చని, ఇప్పటికే కరపత్రాల ద్వారా తెలియచేశామన్నారు. కంటి పరీక్షలకు వచ్చే వారు గతంలో తాము చేయించుకున్న పరీక్షల చీటీలతో పాటు ఆధార్ లేదా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్స్ కాపీ తమ వెంట తీసుకుని రావాలన్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి భోజన సదుపాయాలు సమితి కల్పిస్తుందని, అనంతరం కాకినాడకు ఆసుపత్రి బస్సులో తీసుకుని వెళతారన్నారు. మరిన్ని వివరాలకు 9000376666, 9848337474 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ, కార్యదర్శి వింజమూరి విశ్వనాధం, సభ్యులు నువ్వుల వెంకటరాజు, నువ్వుల బాబ్జి, పెంటపాటి మల్లికార్జునరావు, తోటకూర సూర్య ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.







