ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలను అడ్డుకోవడం తగదు

UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రసారాల నిలిపివేత ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పాత్రికేయులు పేర్కొన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు ఇర్షాద్ ఆలీ, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) ఆధ్వర్యంలో స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారరామ భీమేశ్వర దేవస్థానంలో స్వామి వారికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. తమకు వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తే సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అదే మీడియాకు సంకెళ్లు వేసి భావప్రకటనా స్వేచ్ఛను హరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవినితి, అక్రమాలు వెలికితీసే బాధ్యత మీడియాపై ఉందని, మంచిని, చెడునూ సమానంగా స్వీకరించి చెడును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మీడియాను అడ్డుకోవడం ద్వారా ఏదో సాధించేశామనుకుంటే చాలా పొరపాటని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కానప్పుడు వాటిని ఎత్తిచూపే బాధ్యత మీడియాకు ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలను నిత్యం ప్రజలకు చేరవేస్తున్నది ఈ ప్రసార మాధ్యమాలే అని అన్నారు. ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపే బాధ్యత కూడా ప్రసార మాధ్యమాలపై ఉందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేది కూడా మాధ్యమాలే అని అన్నారు.  ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని, దీన్ని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు.  ప్రజా హితం కోరే మీడియాపై ఆంక్షలు విధించాలని చూడటం అవివేకమని, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రసారాల నిలుపుదలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు విజయ్ కుమార్, బిక్కిన వెంకట్, సిద్దిరెడ్డి సూరిబాబు, ప్రభుదాస్, పేపకాయల సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us