* పంట పొలాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
* అనుమతులు రాకుండానే సాగిస్తున్న తవ్వకాలు
* సంబంధిత శాఖల అధికారుల మధ్య లోపించిన సమన్వయం
* భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనున్న పంట పొలాలు
UPDATED 12th AUGUST 2019 MONDAY 5:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : పచ్చని పంట పొలాలు చేపల చెరువులుగా మారుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపల చెరువుల కోసం పంట పొలాలను ఇష్టారాజ్యంగా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో అక్రమార్కులు అనుమతులు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలను సాగిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో పంట పొలాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. పెద్దాపురం మండల పరిధిలోని కట్టమూరు, జె.తిమ్మాపురం, దివిలి, తదితర గ్రామాల్లో అనుమతులు లేకుండానే చేపల చెరువులను పదుల ఎకరాల్లో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. తవ్వకాలు సాగించేందుకు మత్స్య, రెవెన్యూ, వ్యవసాయ, భూగర్భ జలవనరులు, విద్యుత్, పంచాయతీ, తదితర శాఖలకు చెందిన అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ అది ఎక్కడా అమలు జరగడం లేదు. అనుమతులు తీసుకోకుండానే అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు సాగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడటం లేదు.
పంట భూముల్లో విస్తరిస్తున్న సాగు
చేపల పెంపంకం కోసం మూడు పంటలు పండే భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో పరిసర ప్రాంత భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. నిజానికి పంట భూములు పండేందుకు అనుకూలంగా లేనప్పుడే అనుమతులు మంజూరు చేయాలి. కానీ అది ఎక్కడా అమలు జరగడం లేదు. పంటలు పండే భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. చెరువు తవ్వకాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ భూముల్లో ఏరకం చెరువు తవ్వకాలకు ఉపయోగిస్తున్నారో విచారించడకుండానే అధికారులు అనుమతుల మంజూరు చేసేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. చేపల చెరువులకు అనుమతులను తీసుకుని రొయ్యలు సాగుచేసే అవకాశం కూడా ఉంది. దీంతో సిరులు పండే భూములు నిర్వీర్యం అవడమే కాకుండా చౌడు నేలలుగా మరే ప్రమాదం కూడా ఉంది. వీటికి తోడు వాతావరణ కాలుష్యం సైతం పెరిగిపోతుంది.
అధికారులు ఏం చేస్తున్నట్లు...
చేపల చెరువులను అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తుంటే సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువుల తవ్వకాలు సాగించేందుకు తవ్వకందారులు అనుమతుల కోసం మొక్కుబడిగా ధరఖాస్తు చేసి అనుమతుల మంజూరు కాకుండానే చెరువు తవ్వకాలు చేపడుతుంటే సంబంధిత శాఖల అధికారులు మౌనం వహించడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అక్రమ చెరువులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







