UPDATED 5th JUNE 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటు పడాల్సిన అవసరం ఉందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని, ప్రతీ మనిషికి స్వచ్ఛమైన గాలి అవసరమని, అందుకే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కాలుష్య నివారణపై మన చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల పిడి తాళ్లూరి వైకుంఠం, గ్రీన్ టీచర్ ఏ.ఎల్.వి. కుమారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, మానవ మనుగడ కొనసాగాలంటే పర్యావరణం సమతుల్యంగా ఉండాలన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతీ మనిషి మొక్కలు నాటి, వాటిని పెంచే విధంగా కృషి చేయాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణకు పాఠశాల బాల హరితదళం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏపీ రాజేంద్రకుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







