జల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

UPDATED 15th AUGUST 2017 TUESDAY 5:00 PM

సీతానగరం : జల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో సీతానగరం వచ్చిన సీఎం రోడ్డు మార్గంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం  ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్నారు. ముందుగా పంపుహౌస్‌ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం అనంతరం రెండు మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంప్రదాయంగా గోదావరిలో పూలు, పసుపు, కుంకుమలు చల్లి చంద్రబాబు పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెట్ట ప్రాంత రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరందక నాలుగు దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారని ఈ పథకం మెట్ట రైతులకు సంజీవని అన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని రాజకీయ స్వార్థంతో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని విమర్శించారు. భూసేకరణలో 90 శాతం మంది రైతులు సహకరించారని, మరో 10 శాతం మందిని కొందరు రెచ్చగొట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా చేశారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఈ పథకం నిర్మాణం విషయంలో అధికారులు, కాంట్రాక్టర్ల సమర్ధవంతంగా వ్యవహరించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేశారని సీఎం అభినందించారు. బీహెచ్‌ఈఎల్‌ సకాలంలో మోటార్లను అందజేయలేదని, దీంతో తాత్కాలికంగా వేరే ప్రాంతం నుంచి రెండు మోటార్లను తెచ్చి ఇక్కడ అమర్చినట్లు తెలిపారు. మోటార్లు ఎక్కడైన వినియోగించే విధంగా ఏర్పాట్లు చేస్తామని, మెబైల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం రెండు దశలు పూర్తి చేసి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా శ్రీకాకుళం వరకు నీటిని తీసుకెళ్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తన జీవిత కల అంటూ దీనిని పూర్తి చేస్తేనే ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు. 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కాపర్‌ డామ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రావెటీపై నీటిని విడుదల చేస్తామన్నారు. పునరావాసం, భూసేకరణ నిమిత్తం  సుమారు రూ36 వేల కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో జలవనరుల శాఖతో పాటు, సిమెంటు రోడ్ల నిర్మాణం, భూగర్భ జలాల పరిరక్షణ, బహిరంగ మల విసర్జన లేని గ్రామాలు తదితర కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఇతర శాఖల్లోనూ భవిష్యత్తులో ఇదే జోరును కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఇన్‌ఛార్జి సబ్‌ కలెక్టర్‌ విజయ్‌రామరాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us