UPDATED 7th MAY 2018 MONDAY 9:00 PM
పెద్దాపురం: వేసవి క్రికెట్ క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, క్రీడా నైపుణ్యంతో ప్రతిభ కనబరుస్తూ అత్యుత్తమ క్రీడాకారులుగా తయారుకావాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె.ఎస్. కిరణ్ రాజు అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ అండర్- 16 బాలికల వేసవి క్రికెట్ క్రీడా శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాథమిక దశ నుంచి చిన్నారులను క్రీడలవైపు మరలే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. శారీరక దారుఢ్యమే కాకుండా, చక్కని క్రమశిక్షణ, దేశానికి కీర్తిని తెచ్చేవి క్రీడలేనని అన్నారు. ఈ క్రీడా శిబిరానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పలువురు క్రీడాకారులు హాజరయ్యారని, వీరికి 20 రోజులపాటు ఇక్కడ శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత సి.హెచ్. విజయ్ ప్రకాష్, క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ నాయుడు, సహాయ కార్యదర్శి కొండలరావు, కోచ్ దుర్గాప్రసాద్, లక్ష్మీనారాయణ, రంజీ క్రీడాకారులు ఇజ్రాయిల్ రాజు, కృష్ణమూర్తి, ఫిట్ నెస్ ట్రైనర్ పింకీ, తదితరులు పాల్గొన్నారు.







