రానున్న నాలుగు రోజులు వర్షాలు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021:‌ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజులు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వరికోతలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సూచించారు. బుధవారం రాత్రి ఆయన సంయుక్త కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, భార్గవ్‌తేజతో కలిసి కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని ఆర్‌బీకేల్లో విక్రయించాలని సూచించారు. ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ, బీమా సొమ్ము అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాస్తవ సాగుదారులకే వీటిని అందజేస్తామన్నారు. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలన్నారు. తీర ప్రాంత మండలాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మన్యంలో వాగులు, వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉందన్నారు. ఇక్కడ గర్భిణులను ప్రసవ నిరీక్షణ గదులకు తరలించాలని ఆదేశించారు. జగనన్న గృహ హక్కు పథకం, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణం, భూదస్త్రాల స్వచ్ఛీకరణ, రీ-సర్వే కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, డీఎంహెచ్‌వో గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us