UPDATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల నుంచి తప్పించుకునేందుకు వైసిపి నేతలు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలోని ప్రధాని కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్ జంక్షన్ లో విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో ఎన్టీఆర్ ఎలుగెత్తితే ప్రతిపక్ష నాయకులు తమ స్వార్థం కోసం తాకట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోందని అన్నారు. తక్షణమే విజయసాయిరెడ్డి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి), గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, టిడిపి పట్టణ కార్యదర్శి తూతిక రాజు, టిడిపి తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సీనియర్ టిడిపి నాయకులు పచ్చిపాల సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.







