UPDATED 6th JUNE 2019 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ఆరవ తేదీ నుంచి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతుల ద్వారా విద్యార్థుల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని అన్నారు. డసాల్ట్ సిస్టమ్స్ సంస్థ సహకారంతో త్రీడి ఎక్స్ పీరియన్స్ విభాగంలో మెకానికల్ డిజైన్ కోర్సులపై శిక్షణ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ పర్యవేక్షణలో ఈ శిక్షణా తరగతులు వచ్చే నెల ఐదవ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎంవి హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.వి. రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







