UPDATED 18th DECEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. స్థానిక సత్యనారాయణపురంలో మంగళవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దాల శ్రీను, సేపేని సురేష్ దవులూరి దొరబాబుకు మద్దత్తు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కోఆర్డినేటర్ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోందని, నెరవేర్చలేని హామీలను చంద్రబాబు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 70 శాతం రైతులు ఉన్నారని, అందరికీ అన్నం పెట్టే రైతులకు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, ఒక్కరికి కూడా ఇవ్వకపోగా కుమారుడికి మంత్రి పదవిని కట్టబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, రాజశేఖరరెడ్డి సాగించిన సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అందించగలరనే మనో ధైర్యాన్ని ప్రజల్లో కలిగించేందుకే ఏడాదిగా కుటుంబానికి దూరంగా ఉంటూ వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, సొసైటీ అధ్యక్షుడు కొప్పిరెడ్డి రాధాకృష్ణ, కార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, పితాని సూర్యనారాయణ, వాసంశెట్టి గంగ, జిల్లా కార్యదర్శులు మేకా శ్రీను, ఆదపురెడ్డి శ్రీనివాసు, ఇనకొండ విష్ణు చక్రం, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ అచ్చిరాజు, గవరసాన సూరిబాబు, యూత్ అధ్యక్షుడు గోపు మురళీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా పార్టీ కార్యకర్తలు దొరబాబును గజమాలతో ఘనంగా సన్మానించారు.







