UPDATED 9th APRIL 2018 MONDAY 9:00 PM
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏపూరి సత్యనారాయణ (సత్యంబాబు) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడుతూ శైవాగమ స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల పర్యవేక్షణలో శైవాగమ పండితులతో ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 19న గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, దీక్షాధారణ వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 20వ తేదీ స్వామివారిని, అమ్మవారిని నూతన వధూవరులను చేసి, సాయంత్రం భద్రపీఠంపై స్వామివారిని గ్రామోత్సవం నిర్వహిస్తారన్నారు. అనంతరం వాస్తుహోమం, వాస్తుబలి, ప్రధాన కలశారాధన, లక్ష్మీ గణపతిహోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని, రాత్రి 8గంటలకు స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కల్యాణ మహోత్సవానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.1116 రుసుం చెల్లించి పాల్గొనవచ్చని అన్నారు. 21వ తేదీ పంచవిశతి కలశస్థాపన, పూర్వక అభిషేకం, సరస్వతి హోమం, రుద్ర హోమం, జరుగుతాయని, సాయంత్రం సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం, 22న గవ్యాంతం, చండీహోమం, కళాహోమాలు, సాయంత్రం నందివాహనంపై గ్రామోత్సవం, అనంతరం సదస్యం, సదాపూజ, పండిత సత్కారం వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆఖరిరోజు 23న ఉదయం వృద్ధగౌతమీ తీరంలో స్వామివారికి త్రిశూల స్నానం, గవ్యాంతం, కళాన్యాసాలు, పూర్ణాహుతి, వసంతోత్సవం, రాత్రి 9గంటలకు పుష్పోత్సవం, పవళింపు సేవ వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.







