UPDATED 25th OCTOBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్):మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పాటించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీ దేవి అన్నారు. స్థానిక దుర్గా ప్రసాద్ పాఠశాలలో దీపావళి సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంఈవో విజయలక్ష్మీదేవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి ముంగిళ్లలో దీపాల వరుసలు, నట్టింట్లో లక్ష్మీపూజలు, విరజిమ్మే దివ్వెల వెలుగుల దీపావళి పండుగ అనుబంధాలు, ఆత్మీయతలకు వేదికని అన్నారు. జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జగతిని జాగృతం చేసే ఈ పండుగను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంగా నిర్వహించుకుంటారని, ఈ నేపథ్యంలో పర్యావరణ హితం కోరుతూ ప్రమాదాలకు దూరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. దీపావళి సందర్భంగా కాలుష్య రహిత బాణాసంచా వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ కుమార్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వ సంపద కాపాడేందుకు తమ పాఠశాలలో ప్రతీ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పర్యావరణానికి హాని కలుగకుండా మనం చేయవలసిన కృషిని విద్యార్థులకు వివరించారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయకుమార్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







