UPDATED 20th MARCH 2018 TUESDAY 10:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(ఎపిఐటిఎ) సౌజన్యంతో ప్రముఖ బహుళజాతి సంస్థ ఇన్ఫోసిస్ మంగళవారం ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో బిటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న1100 మంది విద్యార్థినీ, విద్యార్థులు మంగళవారం నిర్వహించిన వ్రాత పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. వ్రాతపరీక్ష ఫలితాలు ప్రకటించి బుధవారం ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎపిఐటిఎ అదనపు సిఈవో విన్నీపాత్రో, ప్రోగ్రాం మేనేజర్ గంగాధర్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు. ఎపిఐటిఎ తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మేనేజర్లు ఎన్. వంశీ, డి.శ్రీనివాస్, వై.రోసిరెడ్డి, గైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







