* ఈ నెల 12 నుంచి ఉత్సవాలు
* విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
UPDATED 11th JULY 2018 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ నెల 12 నుంచి ఆగస్ట్ నెల 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాధం తెలిపారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. యాత్రికుల సౌకర్యార్ధం దేవస్థానం ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వచ్చంద సంస్థల సహాయ సహకారంతో పిల్లలకు పాలు, మజ్జిగ, మంచి నీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. యాత్రికుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. దేవస్థానం కమిటీ, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు, డిఎస్పీ చిలకా వెంకట రామారావు పర్యవేక్షణలో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్ఐ కృష్ణ భగవాన్, సిబ్బంది జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. అమ్మవారి జాతరకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయ శాఖా మంత్రి కె. కృష్ణమూర్తి, ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, కాకినాడ ఎంపి తోట నరసింహం, దేవదాయ శాఖ కమీషనర్ వై.వి. అనురాధ, రీజినల్ జాయింట్ కమీషనర్ వేండ్ర త్రినాథరావు, డిప్యూటీ కమీషనర్ డి.ఎల్.వి. రమేష్ బాబు పాల్గొంటారని కమీషనర్ పుష్పనాథం తెలిపారు. జాతర మహోత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలను ఏర్పాటు చేశారు. జాతర రోజున మ్యూజికల్ బ్యాండ్, బాణసంచా, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఆషాఢమాసంలో మంగళవారం, శుక్రవారం రోజుల్లో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు.







