UPDATED 27th MARCH 2018 TUESDAY 6:30 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల విద్యార్థులు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రూపొందించి పలువురి మన్ననలు పొందారు. కళాశాలలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కె. హర్షవర్ధన్, జి. జాన్ ఉడ్, ఎం. బిందు మృణాళిని, డి. శ్రీనివాసాచారి ఎటువంటి రహదారుల్లోనైనా నడిచే విధంగా నాలుగు చక్రాల అల్లెట్రోన్ క్వాడ్ బైక్ రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ తో నడిచే క్వాడ్ బైకులు అందుబాటులో ఉండగా, కాలుష్యరహితంగా విద్యుత్ శక్తితో నడిచే విధంగా దీనిని రూపొందించారు. గైడ్లు టి.వి. ధర్మరాజు, ఆటోమొబైల్ విభాగాధిపతి వి. సుబ్రహ్మణ్యం సూచనల మేరకు 750 వాట్ల విద్యుత్ మోటార్, 12వి,24 ఆంపియర్ అవర్ నాలుగు బ్యాటరీలు ఉపయోగించి, ముందుకు, వెనకకు ప్రయాణించే విధంగా మూడురకాల స్పీడ్ తో పని చేస్తుందన్నారు. ఒకసారి ఫుల్ గా ఛార్జింగ్ చేస్తే గతుకు రోడ్లు, బురద నేలల్లో సైతం 25 కిలోమీటర్ల వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు. దీని తయారీకి రూ. 40 వేలు ఖర్చయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల వైస్ చైర్మన్ శశికిరణ్ వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, తదితరులు అభినందించారు.







