UPDATED 31st JANUARY 2019 THURSDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ కు చెందిన బిబిఏ, ఎంబిఏ విద్యార్థులకు వ్యవస్థాపకతపై రెండురోజుల వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తాడేపల్లి వాసవి కళాశాలకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. కృష్ణమూర్తి నాయుడు, విశాఖపట్నం ఎంఎస్ఎస్ఇ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రఘురాం హాజరై మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వినియోగించుకుని అంతర్జాలం ద్వారా విషయపరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగాల అన్వేషణలో కాకుండా వ్యవస్థాపకతపై సరైన అవగాహన కలిగి ఉద్యోగాలను ఇచ్చే విధంగా ఎదగాలని అన్నారు. వినూత్నంగా ఆలోచించే వారే బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో చేరతారని, డిగ్రీ చదివిన తర్వాత నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుని తద్వారా భవిష్యత్ ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు సమాజంలో కాలానుగుణంగా జరిగే మార్పులను గమనించి జ్ఞానాన్ని గడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







