చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: తమిళనాడులోని ఊటీ కొండల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా ఉన్న సాయితేజ ఈరోజు మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి చెందారు. సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
భార్యకు వీడియోకాల్ చేసిన గంటల్లోనే సాయితేజ మృతి
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన బి.సాయితేజ .. రావత్‌కు వ్యక్తిగత భద్రత సిబ్బందిగా చేరాక దిల్లీలోనే ఉంటున్నారు. సాయితేజ ఏడాది కిందట తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు. ఈ ఏడాది వినాయకచవితికి వచ్చి, కుటుంబసభ్యులతో గడిపారు. బుధవారం ఉదయం 8.15 గంటలకు భార్య శ్యామలకు సాయితేజ ఫోన్ చేశారు. కుమార్తె దర్శినిని చూడాలని ఉందంటూ.. వీడియోకాల్ చేయాలని భార్యకు చెప్పి, పిల్లల్ని చూస్తూ సంతోషంగా మాట్లాడారు. కొన్ని గంటల్లోనే సాయితేజ మరణించారనే కబురు విని కుటుంబం విషాద సాగరంలో మునిగిపోయింది.







