UPDATED 13th AUGUST 2017 SUNDAY 10:30 PM
విజయవాడ: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు రెడీ అవుతోంది. దసరా వేడుకలను ఈసారి మరింత పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఉత్సవాలకు హాజరుకాబోయే భక్తులకు సమస్త సమాచారాన్ని అరచేతిలో అందించేలా మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్సవాల్లో ఏ విధమైన సమాచారం లోపం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. అమ్మవారి ఆలయం, దసరా ఉత్సవాలతో పాటు సమస్త సమాచారంతో ఈ మొబైల్ అప్లికేషన్ ను రూపొందించారు. అమ్మవారికి అలంకరించిన వస్త్రాలను సైతం ఈ యాప్ ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశారు. గూగుల్ ప్లేస్టోర్ లో కనకదుర్గమ్మ అని టైప్ చేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే దర్శనం, ఆర్జిత సేవలు, ఫిర్యాదులు, స్టోర్స్ ఇలా ప్రతి అంశానికి సంబంధించిన ఐకాన్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చెయ్యగానే సంబంధిత వివరాలు కనిపిస్తాయి. రూ. 100, రూ.300 టికెట్లను యాప్ ద్వారానే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఏరోజు ఏయే ఆర్జిత సేవలుంటాయో తెల్సుకోవచ్చు. యాప్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుని నేరుగా వచ్చి పూజలో పాల్గొనవచ్చు. అమ్మవారికి లేదా అన్నదానానికి విరాళాలు కూడా యాప్ నుంచే అందజేయవచ్చు. దసరా ఉత్సవాల్లో భక్తులకు మరింత సేవలందించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లోనూ ఆలయానికి సంబంధించిన పూజలు, ఇతర సేవల విషయంలో యాప్ ఉపయోగపడనుందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకుమారి తెలిపారు.







