UPDATED 13th SEPTEMBER 2018 THURSDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ వేద-2018కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వేద-2018 పేరిట జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న తొమ్మిదవ టెక్ ఫెస్ట్ సెప్టెంబర్ 14,15 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న విషయం విదితమే అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యే యువ ఇంజినీర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ టెక్ ఫెస్ట్ లో విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేలా, వారి నూతన ఆవిష్కరణలకు అద్దంపట్టేలా పోస్టర్ ప్రజంటేషన్స్, పేపర్ ప్రజంటేషన్స్, ప్రాజెక్టు ప్రజంటేషన్స్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం రూపొందించామని, అగ్రికల్చర్, మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ గ్రూపుల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, నగదు బహుమతులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీలలో పాల్గొనేందుకు గాను వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యారని ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్, డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులుగా కాకినాడ ఓ.ఎన్.జి.సికి చెందిన జి.ఎమ్ (సివిల్) జి.కె.గుప్తా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాకినాడ, హెడ్ టి.కె. రామయ్య, శ్రీ లలితా ఇండస్ట్రీస్ జిఎం షేక్ ఎం.డి.గౌస్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఏ. రామకృష్ణ, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







