UPDATED 12th OCTOBER 2018 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో గ్రంథాలయాల నిర్వహణలో వచ్చిన నూతన టెక్నాలజీ లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్ కోహాపై శుక్రవారం ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు కళాశాలలకు ఆత్మవంటివని, గ్రంధాలయాల నిర్వహణలో ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని నిర్వాహకులు తెలుసుకోవాలని అన్నారు. మంచి సమర్థవంతమైన పనితీరుతో సేవలు అందించడానికి ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఆదిత్య గ్రంధాలయ శాఖాధికారి కె. అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాల కంప్యూటీకరణకు ఉద్దేశించిన ఈ శిక్షణా కార్యక్రమంలో కాకినాడ జెఎన్టీయు, ఆదికవి నన్నయ, ఐఐఐటి-నూజివీడు యూనివర్సిటీలకు చెందిన కళాశాలలతో పాటు జిల్లాలో గల సుమారు 60 ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలకు చెందిన గ్రంధాలయ అధికారులు పాల్గొన్నారు. ఐఐటి(ముంబాయి) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆన్ లైన్ పద్దతిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగింది. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎమ్.డి. కలీషా, తదితరులు పాల్గొన్నారు.







