UPDATED 22nd DECEMBER 2020 TUESDAY 5:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక రామారావు పేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్.విజయ్ ప్రకాష్, ప్రొఫెసర్ సంతానం, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.యస్. మూర్తి పాఠశాల ఆవరణలో గల రామానుజన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సంతానం, సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ ఒకరని, పది సంవత్సరాల వయస్సులోనే ఆయన గణితం పట్ల అనుబంధం ఏర్పరుచుకున్నారని అన్నారు. ఎస్ఎల్ లోని త్రికోణమితిపై రాసిన పుస్తకాలను ఔపోసన పట్టారని, నేటి విద్యార్థులు కూడా పలు పుస్తకాలు చదివి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ రామానుజన్ వంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని, ఆయన ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారని పేర్కొన్నారు. సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుత కానుకను అందించారని, సున్నా ఆవిష్కరణతో గణితశాస్త్రం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. దేశంలో గణితశాస్త్ర అధ్యయనం వేదకాలం నుంచే ప్రారంభమైందని, దశాంశ పద్ధతిని గుర్తించింది కూడా భారతీయులే కావడం విశేషమన్నారు. ఆర్యభట్ట కాలాన్ని భారతీయ గణిత శాస్త్రానికి స్వర్ణ యుగంగా పేర్కొంటారని, మళ్లీ భారతీయ గణిత చరిత్రకు శ్రీనివాస రామానుజన్ వన్నెలద్దారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల 22ను జాతీయ గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. తమ విద్యా సంస్థల్లో గణితం నేర్చుకునే విద్యార్ధుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు, కోర్సులు ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గణిత మేధావి, స్కూల్ వేదిక్ మేధమెటిక్స్ డైరెక్టర్ వినయ్ నాయర్, ఆస్ట్రేలియాకు చెందిన మేధమెటిక్స్ హిస్టోరియన్ జోనాథన్ క్రాబ్ ట్రీ విద్యార్థులకు గణితానికి సంబంధించి మెళకువలను ఆన్ లైన్ ద్వారా తెలియచేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఎం.టి.యస్. శరణ్ చేసిన శ్రీనివాస్ రామానుజన్ ఏకపాత్రాభినయం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.







