* రాజమహేంద్రవరంలో న్యాయవాదుల నిరసన
UPDATED 6th JULY 2020 MONDAY 6:30 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో న్యాయవాదులు సోమవారం నిరసన చేపట్టారు. భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వ బడ్జెట్‌లో న్యాయవాదుల సంక్షేమం కోసం కేటాయించిన రూ. వంద కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ లానేస్తం పేరుతో జూనియర్ న్యాయవాదులకు గత నాలుగు నెలల నుంచి బకాయిపడిన స్టయిఫండ్ తక్షణమే చెల్లించాలని అన్నారు. బార్ కౌన్సిల్ లో నమోదైన వెంటనే జూనియర్ న్యాయవాదులు స్టయిఫండ్ కోసం నిరంతరం దరఖాస్తు చేసుకునేలా మార్పులు తీసుకురావాలని, అలాగే న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకి బార్ కౌన్సిల్ ఇచ్చే రూ. నాలుగు లక్షలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ గా మరో నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లి చంద్రశేఖర్, బట్టు సునీల్ కుమార్, అల్లూరి వెంకట రామరాజు, కాశి శ్రీనివాసరావు, ధర్నాలకోట వెంకటేశ్వరావు, ఫై. రామలింగారెడ్డి, ఎస్. వీరఘవరెడ్డి, కానుపుడి ప్రియతమ్, ముప్పాళ్ళ విశాల స్ఫూర్తి, తదితరులు పాల్గొన్నారు.







