UPDATDED 12th JANUARY 2018 FRIDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల సాంస్కృతిక విభాగం, ప్రగతి కల్చరల్ క్లబ్ "ప్రిజమ్-2018' యాన్యుయేల్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా కాకినాడ జె.ఎన్.టి.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రగతి కల్చరల్ క్లబ్ ప్రార్ధనాగీతం, విద్యార్థినుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ యువత పురోగతికి పలు సూచనలు అందించిన స్వామి వివేకానందుని బోధనలు నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొంది అభివృద్ధి పథంలో పయనించాలని పిలుపునిచ్చారు. విశేష యువశక్తి గల భారతదేశం మూడవ ఆర్ధిక శక్తిగా ఎదగడానికి నేటి యువత కృషి చేయాలని, విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా తమ వ్యక్తిత్వవికాసం పెంపొందించుకోవచ్చన్నారు. కాకినాడ జె.ఎన్.టి.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్ మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక రంగాలలో ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల పూర్తిస్థాయిలో వినియోగించుకొంటూ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ప్రముఖ స్థానాన్ని పోషిస్తుందన్నారు. కళాశాల సాధిస్తున్న అభివృద్ధి శ్లాఘనీయమని. విద్యార్థుల నైపుణ్యాభివృధికి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో 2017-18 వార్షిక నివేదిక ద్వారా కళాశాల సాధించిన విజయాలను పేర్కొన్నారు. సందేశాత్మక స్కిట్స్, ఉర్రూతలూగించే నృత్యాలు, పాటలు, సామాజిక సేవపై లఘుచిత్రాలు, ఫ్యాషన్ పెరేడ్, తదితర కార్యక్రమాలు సభికులను ఎంతగానో అలరించాయి. అనంతరం 2013 -17 అకడమిక్ టాపర్స్ కు గోల్డ్ మెడల్స్, నగదు బహుమతులు, అలాగే కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తల్లి కమలాంబ జ్ఞాపకార్ధం 2014 -18 సంవత్సరం అన్ని విభాగాల్లో అకడమిక్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థినులకు నగదు పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, ప్రొఫెసర్ వై. జయబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎస్.వి.రమణమూర్తి, వివిధ విభాగాధీపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







