UPDATED 28th FEBRUARY 2019 THURSDAY 6:00 PM
గండేపల్లి: యువత పరిశోధనలవైపు ముందుకు సాగాలని కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బేసిక్ సైన్స్, ట్రిపుల్ ఇ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబుల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం సాధించిన విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్‌పట్ల గౌరవసూచకంగా ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని, జాతీయస్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ పై వివిధ అంశాలలో పిపిటీలు, క్విజ్, ప్రాజెక్టులు, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







