UPDATED 16th OCTOBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. అందరికీ ఇళ్ళు పధకంలో భాగంగా సామర్లకోట పట్టణంలో గల వార్డుల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లతో వార్డుల్లో సమగ్రంగా సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని అన్నారు. వార్డుల్లో గల సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాలను పరిశీలించుకుని ఆ జాబితాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియపరచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలను ప్రవేశపెట్టి అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఎలాంటి అపోహలు, విమర్శలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రజల ఇళ్ళ వద్దకే అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ రామారావు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ మంజుల, జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, మెప్మా సిఎం ఎం సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.







