తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్‌తేజ
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: గృహ నిర్మాణ లబ్ధిదారులకు వారి ఇళ్లపై సర్వహక్కులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమలు చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని.. ఎవరిపైనా ఒత్తిళ్లు లేవన్నారు. ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈనెల 10న ప్రచురితమైన ‘ఎప్పుడో కట్టిన ఇళ్లకు.. ఇప్పుడెందుకు వసూళ్లు?’ కథనంపై ఆయన స్పందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందిన లబ్ధిదారులకు.. అతి తక్కువ రుసుము చెల్లించడం ద్వారా వారికి రుణమాఫీతోపాటు ఇంటి స్థలంపై క్రయవిక్రయాలతో సహా అన్ని హక్కులను కల్పిస్తూ రిజిస్టర్డ్ దస్తావేజులు అందిస్తామన్నారు. ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు లేకుండా ప్రభుత్వమే పట్టాలను జారీ చేస్తోందని జేసీ పేర్కొన్నారు.







