UPDATED 3rd DECEMBER 2018 MONDAY 7:00 PM
సామర్లకోట: సామర్లకోట-పెద్దాపురం మున్సిపాల్టీ పరిధిలో ప్రధాన రహదారిపై రూ. ఐదు కోట్లుతో సెంట్రల్ లైటింగ్, బెర్మ్ లకు ఇంటర్ లాకింగ్ టైల్స్, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు స్థానిక శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సామర్లకోట-పెద్దాపురం రహదారి విస్తరణలో భాగంగా రూ.మూడు కోట్లు వ్యయంతో తొమ్మిది కిలోమీటర్లు పొడవున సెంట్రల్ లైటింగు, రూ. రెండు కోట్లు వ్యయంతో బెర్మ్ లకు ఇంటర్ లాకింగు టైల్స్, ఫుట్ పాత్ లకు చెక్క టైల్స్ పనులను కోర్ నెట్ ప్లాన్ నిధులతో నిర్మిస్తున్నామని, ఈ పనులు జనవరి 2019 నాటికి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే రూ.రెండు కోట్ల 80 లక్షలతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని, అలాగే రూ.40 లక్షల ఓఎన్జీసీ నిధులతో నీలమ్మ చెఱువు రివిట్ మెంట్ పనులు, రూ.44 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో మూడు పార్కులు, రూ.10 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నామని తెలిపారు. పెద్దాపురం పట్టణానికి రూ.50 లక్షలు, సామర్లకోట పట్టణానికి రూ.50 లక్షలు వంతున గుడా నిధులు మంజూరయ్యాయని, వీటిలో రూ.40 లక్షలు దేవాలయాల సెంటర్ లైటింగుకు, రూ.10 లక్షలతో పొట్టి శ్రీరాములు ఎన్టీఆర్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పెద్దాపురంలో మూడు బస్ షెల్టర్లు ఏర్పాటుకు రూ.15 లక్షలు, సామర్లకోటలో బస్ షెల్టర్ కు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రూ. రెండు కోట్లు ఓఎన్జీసీ నిధులతో పిఠాపురం-సామర్లకోట ఆర్&బి రోడ్డును అభివృద్ధి పరుస్తున్నామని, రూ.40 లక్షలతో సెంటర్ లైటింగు, టవర్ కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అలాగే రూ.మూడు కోట్లతో అచ్చంపేట-సామర్లకోట రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని, శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలతో డార్మెంట్ నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.250 కోట్లుతో ఎడిబి రోడ్డు అభివృద్ధి చేస్తున్నామని, సామర్లకోటలో అన్నక్యాంటిన్ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రూ.11 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి భాదితులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్లు కొరిపూరి రాజు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సామర్లకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు అడబాల కుమారస్వామి, బొడ్డు బంగారుబాబు, బడుగు శ్రీకాంత్, గుమ్మళ్ళ రామకృష్ణ, మన్యం చంద్రరావు, విద్యుత్ శాఖ ఇఇ పులి రామసుబ్బారావు, డిఇ రామరాజు, ఎఇ వెంకటేష్, ఆర్&బి డిఇ సూర్యప్రకాశరావు, ఎఇ రమేష్, తదితరులు పాల్గొన్నారు.







