UPDATED 21st DECEMBER 2020 MONDAY 7:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో Exergy & Exergoeconomic Evaluation of Thermal Power Plants అనే అంశంపై స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమైనట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఐఐటి (తిరుపతి)కి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇ. అనిల్ కుమార్ వక్తగా హాజరయ్యారని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం మూడు దశలుగా కొనసాగుతుందని, అందులో మెదటి దశ ఈనెల 21 నుంచి 26వ తేదీ జరుగుతుందని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.ఎన్.వి. రామారావు మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమానికి 15 రాష్ట్రాలకు చెందిన 213 మంది అధ్యాపకులు నమోదు చేసుకున్నారని, ధర్మల్ పవర్ ప్లాంట్ లో ఎనర్జీ ఎవల్యూషన్, ఆధునిక మెలకువలు, తదితర అంశాలను తెలియచేస్తారని అన్నారు. అంతేకాకుండా అధ్యాపకులు నూతన ఆవిష్కరణలతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







