UPDATED 13th MARCH 2018 TUESDAY 6:30 PM
పెద్దాపురం: లఘుచర్చ పేరుతో ప్రత్యేక హోదా విషయంపై శాసనసభలో కొత్త నాటకానికి అధికార టిడిపి తెరతీసిందని వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ ఆరోపించారు. స్థానిక విలేఖరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. టిడిపికి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రెండుసార్లు తీర్మానం చేశారని, ఇప్పుడు మళ్లీ లఘుచర్చ పేరుతో తెరతీయడంపై ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి దక్కేలా కూడా అధికార టిడిపి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. కేవలం కమీషన్ల కోసం అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు దాన్ని వ్యతిరేకించడంపై ఆయన అధికార పార్టీ తీరును శంకించారు. నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చట్ట సవరణ చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేయాలన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.







