UPDATED 23rd SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఆంగ్లేయులను శాంతియుతంగా ఎదురించేందుకు, భారత జాతి ఐక్యత కోసం ఆనాడు బాలగంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారని, హిందూ సంస్కృతి పెంపొందించేవి పండగలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సేపేని సురేష్ అన్నారు. స్థానిక సత్యనారాయణపురంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో గణేష్ లడ్డును రూ.4600కు ఆయన కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మతాలకతీతంగా అన్ని పండగలు కలిసి చేసుకోవడం భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచే పవిత్ర దేశం భారతావనికే దక్కుతుందన్నారు. హిందూ సంస్కృతి కార్యక్రమం దీపారాధనతోనే మొదలవుతుందని, అంటే ప్రతీ ఒక్కరూ అంధకారం నుంచి వెలుగుల్లోకి రావాలని, హిత కార్యక్రమాలు ఐక్యంగా ఉండి చేయాలని చెప్పారు. అనంతరం గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై అంటూ జయజయ ధ్వనులతో యువకుల కేరింతలు, భక్తజన సందోహాల మధ్య గణపయ్యను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిమజ్జనానికి తరలారు. అనంతరం పవిత్ర గోదావరి కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గండి రఘు, పడాల చిట్టిబాబు, పడాల వీరబాబు, పడాల సుబ్రహ్మణ్యం, నాగం అశోక్, కౌశిక్, మల్లిరెడ్డి వెంకట్రావు, కరప మణికంఠ,నాయుడు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







