Updated 30th March 2023 Thursday 3:20 pm
Indore Temple Stepwell Collapse : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో స్థలం సరిపోకపోవటంతో కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చుకున్నారు. ఎక్కువ మంది భక్తులు అదే ప్రాంతంలో గుమ్మిగూడటంతో ఆ మెట్టు బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఇరవై మంది భక్తులు బావిలో పడిపోయారు. అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది 15మంది కాపాడారు. మరో పది మందిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు భక్తులు మెట్ల భావికి ఉన్న అంచులను పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్ కలెక్టర్, కమిషనర్ తో ఫోన్‌లో వివరాలు తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలతీరును సీఎం చౌహాన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద విషయాన్ని సీఎం శివరాజ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. ఇండోర్ లో జరిగిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని ట్విటర్ ద్వారా మోదీ పేర్కొన్నారు. శివరాజ్ చౌహాన్ తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, ఎవరి ప్రాణాప్రాయం లేకుండా జాగ్రత్త పడుతున్నామని సీఎం చౌహాన్ ప్రధానికి తెలిపారు.







